నారా లోకేష్ ఆస్తులు రూ. 542 కోట్లు
గత ఐదేళ్లలో 45 శాతం పెరిగిన ఆస్తులు
అమరావతి – ఆస్తులలో జగన్ మోహన్ రెడ్డిని మించి పోయారు చంద్రబాబు నాయుడు కుటుంబం. ఆయన తనయుడు నారా లోకేష్ ఆస్తులను ప్రకటించారు. మంగళగిరిలో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.
విచిత్రం ఏమిటంటే 2019 నుంచి 2024 వరకు గత ఐదేళ్ల కాలంలో నారా లోకేష్ కు సంబంధించి 45 శాతానికి పైగా ఆస్తులు పెరగడం గమనార్హం. తన భార్య నారా బ్రాహ్మణి, కొడుకుతో సహా మొత్తం ఆస్తులు రూ. 542 కోట్లుగా స్పష్టం చేశారు నారా లోకేష్.
కాగా 2019లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ రూ. 373 కోట్లు మాత్రమే ఉండేది. కానీ ఈ ఐదేళ్లలో అవి మరింత పెరగడం విశేషం. ఇక కేసుల విషయానికి వస్తే నారా లోకేష్ పై ఏకంగా 24 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ప్రధానమైనది.
నారా లోకేష్ , భార్య బ్రాహ్మని , కొడుకు రూ. 394 కోట్ల విలువైన చరాస్తులను కలిగి ఉన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ , హెరిటేజ్ ఫిన్ లీజ్ , నిర్వాణ హోల్డింగ్స్ , మెగా బిడ్ ఫైనాన్స్ కంపెనీలలో ఎక్కువగా వాటా కలిగి ఉన్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, మణికొండ, మదీనాగూడ, మాదాపూర్‌లో భవనాలు, భూముల రూపంలో లోకేష్, కుటుంబానికి రూ.148 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. లోకేష్, కుటుంబానికి డివిడెండ్, జీతం, అద్దె , వ్యాపారం రూపంలో 2022-2023లో రూ. 18 కోట్లు , ఆదాయం రూ. 9 కోట్లుగా వచ్చినట్లు చూపించారు నారా లోకేష్.