పంధ్రాగష్టు లోపు రుణ మాఫీ చేస్తం
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
పాలమూరు జిల్లా – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 లోపు రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. ఆరు నూరైనా సరే, కేసీఆర్ ఫాం హౌస్ లోపల ఉరేసుకుని సచ్చినా సరే మాఫీ చేయడం ఆగదన్నారు సీఎం.
ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు కావాలని అయోమయం చేసేలా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అయినా జనం వారిని నమ్మరని అన్నారు. వారిని ఓడించినా ఇంత వరకు బుద్ది రాలేదన్నారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా తాము అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం అద్భుతమైన స్పందన లభిస్తోందని చెప్పారు. రోజూ వేలాది మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని అన్నారు.
దీనిని జీర్ణించు కోలేని గులాబీ, కాషాయ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారంటూ ధ్వజమెత్తారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కోడంగల్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.