మతం పేరుతో మోదీ చిచ్చు
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ న్యాయ యాత్ర చేపట్టారు. ఎర్రగొండ పాలెం, సంతనూతలపాడు , అద్దంకి నియోజకవర్గాలలో పర్యటించి ప్రసంగించారు. భారీ ఎత్తున జనం పోగయ్యారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఆడ లేక మద్దెల మోత అన్నట్టు తనకు పాలన చేత కాక కాంగ్రెస్ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పదేళ్ల కాలంలో దేశంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పు కోలేక తమ పార్టీపై విషం చిమ్ముతున్నాడని, ఇది మంచి పద్దతి కాదన్నారు.
అధికారంలోకి వస్తే మంగళ సూత్రాలు తెంచుతామని, మతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిలా రెడ్డి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అల్లర్లు సృష్టించి ఎన్ని మంగళ సూత్రాలు తెంచలేదని ప్రశ్నించారు.
ఇప్పుడు ప్రధానిగా ఉన్న సమయంలో మణిపూర్ ఘటనతో ఎన్ని మంగళ సూత్రాలు తెంచలేదు ..? రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారు. మోదీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారని ఆరోపించారు.