పాసు పుస్తకాలపై జగన్ బొమ్మలా
చంద్రబాబు నాయుడు సీరియస్
శ్రీకాకుళం జిల్లా – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని సైకోగా అభివర్ణించారు తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు . ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయనను చూసినప్పుడల్లా తనకు గొడ్డలి గుర్తుకు వస్తుందన్నారు. నవ రత్నాల పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టాడని ఆరోపించారు.
ఎన్నికల సంఘం రూల్స్ ను అడ్డగోలుగా అతిక్రమిస్తున్నాడని సీఎంపై సంచలన ఆరోపణలు చేశారు నారా చంద్రబాబు నాయుడు. పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ బొమ్మ దేనికి అని ప్రశ్నించారు. తాడేపల్లిలో కూర్చొని మీ తలరాతలు రాస్తాడా అని నిలదీశారు.
జగన్‌ని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్‌కు ఇదే చివరి ఛాన్స్ కావాలన్నారు. తనకు రాజకీయాలు కొత్త కాదని చెప్పారు. రాష్ట్రం గాడి తప్పిందని.. .రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు..
జగన్ పాలనలో విద్యుత్ చార్జీలు పెరిగాయని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అన్నారని..నాసిరకం మద్యం అమ్మకాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విరుచుకు పడ్డారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.