NEWSTELANGANA

హ‌స్తం జ‌నం మెచ్చిన నేస్తం

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ త‌ర‌పున బ‌రిలో నిలిచిన దానం నాగేంద‌ర్ త‌ర‌పున ప్ర‌చారం చేప‌ట్టారు. పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన రోడ్ షోకు భారీ ఎత్తున జ‌నం హాజ‌ర‌య్యారు.

సీఎంతో పాటు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , మాజీ ఎంపీ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హరుద్దీన్ , అంజ‌న్ కుమార్ యాద‌వ్ , ఎంపీ అనిల్ కుమార్ యాద‌వ్ , నాంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఇన్ ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ , స‌న‌త్ న‌గ‌ర ఇన్ ఛార్జ్ కోట నీలిమ‌, అంబ‌ర్ పేట్ ఇన్ ఛార్జ్ రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటుంద‌న్నారు రేవంత్ రెడ్డి. ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను త‌ప్ప‌కుండా అమ‌లు చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విధంగా ఎన్నిక‌ల కోడ్ ఉన్నందు వ‌ల్ల రైతులు తీసుకున్న రుణాల‌ను మాఫీ చేయ‌లేక పోయామ‌ని పేర్కొన్నారు.

ఆగ‌స్టు 15 లోపు అన్న‌దాత‌లంద‌రికీ వారు తీసుకున్న రుణాల‌కు సంబంధించి రూ. 2 ల‌క్ష‌ల లోపు ఉన్న రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఎనుముల రేవంత్ రెడ్డి.