హామీలు అమలు చేస్తే రిజైన్ చేస్తా
సవాల్ విసిరిన తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయాలు మరింత వేడెక్కాయి. నువ్వా నేనా అంటూ మాటలతో హీట్ పుట్టిస్తున్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. మరో వైపు బీఆర్ఎస్ బాస్ , తొలి తెలంగాణ సీఎం కేసీఆర్ , మాజీ మంత్రి కేటీఆర్ లు సైతం తూర్పార పడుతున్నారు. కేవలం కక్ష సాధింపు ధోరణితో కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వైపు బీఆర్ఎస్ అవి హామీలు కావని అబద్దాలంటూ ఎద్దేవా చేసింది. దీనిపై సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము ఇచ్చిన మాట ప్రకారం అన్నింటిని అమలు చేస్తున్నామని చెప్పారు.
ఎన్నికల కోడ్ కారణంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేయలేక పోయామన్నారు. ఆగస్టు 15 లోపు ప్రతి ఒక్కరి రుణాన్ని మాఫీ చేసి తీరుతామని ప్రకటించారు ఎనుముల రేవంత్ రెడ్డి.
దీనిపై స్పందించిన తన్నీరు హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంకు సవాల్ విసిరారు. ఒకవేళ సీఎం చెప్పినట్టు ఆరు గ్యారెంటీలను 15 లోపు అమలు చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు.