ఎన్నికల బరిలో బర్రెలక్క
దిగ్గజ నేతలతో ఢీ కొనేందుకు సై
నాగర్ కర్నూల్ జిల్లా – తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష మరోసారి సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ఆమె ఇటీవలే పెళ్లి కూడా చేసుకున్నారు.
ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బర్రెలక్క బరిలో నిలవడం విశేషం. ఆమె పేరు పొందిన నాయకులతో పోటీ పడుతున్నారు. బరిలో ఎవరు ఉన్నా తాను పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి మాజీ ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ మల్లు రవి, బీజేపీ నుంచి భరత్ కుమార్ బరిలో ఉన్నారు.
ఈ ముగ్గురు డబ్బులు కలిగిన పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారే. కానీ ఎవరి సాయం లేకుండా ఒంటరిగానే పోటీకి దిగుతోంది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. ఈసారి లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు 5,754 ఓట్లు తెచ్చుకుని అందరినీ ఆశ్చర్య పోయేలా చేసింది. ఇక్కడ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థికి అన్ని సీట్లు కూడా రాలేదు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు వణుకు పుట్టించేలా చేసింద బర్రెలక్క.