ఆ ముగ్గురు మోదీకి బానిసలు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబుతో కూడిన కూటమిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపల్లె, పెడన, పామర్రు నియోజకవర్గాలలో పర్యటించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దివంగత వైఎస్సార్ పేరుతో పవర్ లోకి వచ్చిన జగన్ రెడ్డి ఆయన ఆశయాలకు తూట్లు పొడిచారని ఆరోపించారు.
ప్రజలు నమ్మి అధికారాన్ని అప్పగిస్తే రాష్ట్రానికి ఏం చేశారంటూ జగన్ రెడ్డిని నిలదీశారు. జగన్ , పవన్, చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బానిసలుగా మారారంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి హోదా కావాలంటే జగన్ రెడ్డి దిగి పోవాలని అన్నారు.
పోలవరం పూర్తి కావాలన్నా, రాష్ట్రం అభివృద్ది సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు వైఎస్ షర్మిలా రెడ్డి. మాయ మాటలతో, నవ రత్నాల పేరుతో మోసం చేస్తున్న వైసీపీ సర్కార్ కావాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే అభివృద్దికి ఓటు వేసినట్టేనని పేర్కొన్నారు.