శ్రీశైలం కోసం రాజధాని బస్సులు
ప్రత్యేకంగా నడుపుతున్నామన్న ఎండీ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఖుష్ కబర్ చెప్పింది. ఇప్పటికే సకల సదుపాయాలతో కొత్త బస్సులను తీసుకు వస్తోంది. తాజాగా ఎండా కాలంలో మరింత చల్లదనంతో పాటు అదనపు సౌకర్యాలతో లహరి బస్సులను తీసుకు వచ్చింది. ఇవి ప్రధాన నగరాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లేలా చేస్తోంది.
తాజాగా ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ గురువారం కీలక ప్రకటన చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర విషయం పంచుకున్నారు. అదేమిటంటే దేశంలోనే పేరు పొందిన ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలానికి ప్రత్యేకంగా సకల వసతులతో కూడిన రాజధాని బస్సులను తీసుకు వచ్చినట్లు వెల్లడించారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా కొత్త రకం బస్సులను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రతి గంటకు ఒక బస్సును అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు సజ్జనార్. ఈ బస్సుల్లో జేబీఎస్ నుంచి రూ. 524, బీహెచ్ఈఎల్ నుంచి రూ. 564 టికెట్ ధర నిర్ణయించినట్లు స్పష్టం చేశారు టీఎస్ఆర్టీసీ ఎండీ.
అత్యాధునిక హంగులతో ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా సంస్థ తయారు చేయించిందన్నారు. వేసవిలో చల్లదనం అందించే ఈ బస్సులను వినియోగించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని కోరారు. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించాలని సూచించారు.