NEWSTELANGANA

అప్పుల భారం దేశానికి శాపం

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైద‌రాబాద్ – ప‌దేళ్ల మోదీ పాల‌న‌లో ఒరిగింది ఏమీ లేద‌న్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. కులం పేరుతో, మ‌తం పేరుతో రాజ‌కీయాలు చేయ‌డం త‌ప్పా, ఓట్లు కొల్లగొట్టాల‌నే ధ్యాస త‌ప్ప దేశం కోసం ఏమైనా చేశారా అని ప్ర‌శ్నించారు. కేంద్రంపై ప్ర‌జా ఛార్జ్ షీట్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా రేవంత్ రెడ్డి మీడియాతో మ‌ట్లాడారు. ప‌దే ప‌దే డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ అంటూ ప్ర‌చారం చేసుకునే బీజేపీకి ఏం అర్హ‌త ఉంది ఓట్ల‌ను అడిగేందుక‌ని ప్ర‌శ్నించారు .

ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన భార‌తీయ కూట‌మికి ప‌ట్టం క‌ట్టేందుకు రెడీగా ఉన్నార‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇదే స‌మ‌యంలో ఆర్ఎస్ఎస్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం.

వ‌చ్చే 2025 నాటికి ఆర్ఎస్ఎస్ పుట్టి 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంద‌న్నారు. అందుకే రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యాన్ని తీసి వేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఆ సంస్థ ఉందంటూ బాంబు పేల్చారు. కానీ జ‌నం ఒప్పుకోర‌న్నారు. 143 కోట్ల ప్ర‌జానీకంలో అత్య‌ధిక శాతం ద‌ళితులు, ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు, బీసీలు ఉన్నార‌ని వారి ఆగ్ర‌హం ముందు బీజేపీ త‌ల వంచ‌క త‌ప్ప‌ద‌న్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.