విజయవాడ : బీసీల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం గౌతు లచ్చన్న ఎన్నో ఉద్యమాలు చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రైతుల కోసం మొట్ట మొదటిసారి పాదయాత్ర చేసిన ఘనత కూడా ఆయనదేనన్నారు. శ్రీకాకుళం నుంచి చైన్నై వరకూ 1600ల కిలో మీటర్ల పాదయాత్ర చేశారన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో లచ్చన్న పోరాటం ఆనాటి ఆంగ్లేయులకు కంటి మీద కునుకు లేకుండా చేసిందన్నారు. చివరికి ఆయనను కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు ఇచ్చిందన్నారు. దేశానికి స్వాతంత్ర్య వచ్చిన తరవాత బీసీలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారన్నారు. జగన్ హయాంలో ఎందరో బీసీలు హత్యలకు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, బీసీలను అక్కున చేర్చుకున్నారని చెప్పారు అనగాని సత్య ప్రసాద్ . బీసీలు విద్యతోనే ఉన్నత స్థానాలకు చేరుకోగలరని సీఎం చంద్రబాబు నమ్మారని, అందుకనే, బీసీల విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, వాటిని తిరిగి గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎక్కడా సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు.





