పడకేసిన జగన్ పాలన
నిప్పులు చెరిగిన షర్మిల
ఏలూరు జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రధానంగా తన సోదరుడు , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఏపీ న్యాయ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఇక్కడి ఎమ్మెల్యే పేకాట , కోడి పందాలకు పెట్టింది పేరంటూ ఆరోపించారు. ఆయన వ్యాపారం మూడు పూలు ఆరు కాయలు అన్నట్టుగా ఉందంటూ ఎద్దేవా చేశారు ఏపీ పీసీసీ చీఫ్. నియోజకవర్గంలో మొత్తం మట్టిని దోచేశాడంటూ ఆరోపించారు. ప్రధాన సమస్యగా ఉన్న కొల్లేరును పట్టించు కోవడం మానేసిన ఎమ్మెల్యేకు తగిన రీతిలో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు .
పోలవరం వైఎస్సార్ కల అని, అది గనుక కట్టి ఉంటే ఈ నియోజకవర్గం మొత్తం సస్య శ్యామలం అయి ఉండేదన్నారు. గత ఎన్నికల్లో పూర్తి చేస్తానన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పూర్తిగా మరిచి పోయాడంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఆయనను ఇంటికి పంపిస్తేనే కానీ ఏపీ బాగు పడదన్నారు.
చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నాశనం చేశాడని, జగన్ రెడ్డి వచ్చాక అప్పుల కుప్పగా మార్చాడని ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి.