గులాబీ దళం పోరాటం ఆపం
రేవంత్ సర్కార్ పై ఇక యుద్దం
హైదరాబాద్ – తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఉన్నా లేకున్నా ఈ దేశంలో అత్యధిక కార్యకర్తల బలం కలిగిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు.
తాము పవర్ లో లేక పోయినా గులాబీ దళం పోరాడుతూనే ఉంటుందన్నారు. ప్రజల పక్షాన తన గొంతుక వినిపిస్తుందన్నారు కేటీఆర్. అంతకు ముందు ఆయన పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి , జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన ఏ పనినైనా వదలకుండా ముందుకు తీసుకు పోయిన చరిత్ర గత రెండున్నర దశాబ్దాలలో ప్రజలందరికీ తెలుసన్నారు కేటీఆర్. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంట పట్టించుకుని ముందుకు నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి అని స్పష్టం చేశారు.
విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగి పోము ఇదే తీరుగా మా ప్రస్థానం సాగిందని, భవిష్యత్తులోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే ఉంటామని ప్రకటించారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అన్న జయశంకర్ సార్ మాటలు ఎప్పటికీ వాస్తవంగా నిలుస్తాయన్నారు.