కుప్పంలో రూ. 700 కోట్ల కంపెనీ ఏదీ..?
చంద్రబాబును ప్రశ్నించిన విజయ సాయి
నెల్లూరు జిల్లా – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి. శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రచారం చేసుకోవడంలో తనను మించిన వారు లేరంటూ ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియా అహో ఒహో అంటూ బాబు గురించి ఊదర గొట్టడం తప్పితే ఆయన ఏపీకి చేసింది ఏమీ లేదన్నారు.
ఓ నలుగురు విదేశీయులను వెంట బెట్టుకోవడం, వారితో భారీ ఎత్తున పెట్టుబడి ఒప్పందం కుదిరిందని ప్రకటన చేయడం రివాజుగా మారిందన్నారు. తను పాలించిన సమయంలో ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళ్లాడని, ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదన్నారు విజయ సాయి రెడ్డి. ఇందుకు ఉదాహరణగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు చేసిన ప్రకటన గురించి తెలిపారు. ఆధారాలతో సహా బయట పెట్టారు.
కుప్పంలో రూ. 700 కోట్లతో కూరగాయలు, పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్టు ఎల్లో మీడియాలో అప్పట్లో పెద్ద వార్త వచ్చిందని తెలిపారు. రోజుకు 100 టన్నుల కెపాసిటీ ఉన్న పరిశ్రమ అనీ, వేల మంది రైతులకు వరప్రదాయిని అని చంద్రబాబు చెప్పాడని తెలిపారు. పరిశ్రమ లేదు. ప్రచారం మాత్రమే మిగిలిందన్నారు.