తప్పు చేస్తున్నావు జగన్
ఇక తప్పించు కోలేవు
మంగళగిరి – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయన ఏపీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పనిగట్టుకుని తమ పార్టీకి చెందిన ప్రచార వాహనాన్ని తగుల బెట్టించావంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇది పక్కా నీవు చేసిన పనేనంటూ మండిపడ్డారు. శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈసారి ఎ న్నికల్లో దారుణంగా ఓడి పోతున్నావని తెలిసి తట్టుకోలేక ఇలాంటి దిగజారుడు, నీచ రాజకీయాలకు తెర లేపావంటూ ఆరోపించారు. అయినా కాలం ఎవరినీ ఊరికే వదిలి పెట్టదని తెలుసుకో అని పేర్కొన్నారు నారా లోకేష్.
తప్పు మీద తప్పు చేస్తున్నావు జగన్ అంటూ హెచ్చరించారు. ఇదిలా ఉండగా తాజాగా అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద టీడీపీ ప్రచార వాహనానికి నిప్పు పెట్టడం వైకాపా దుర్మార్గాలకు పరాకాష్ట అని ఆరోపించారు.
డ్రైవర్ ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించిన మీ రాక్షసత్వం సభ్య సమాజానికే సిగ్గుచేటు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల అరాచకాలకు అండగా నిలిచిన అధికారం కోల్పోయే ముందైనా పశ్చాత్తాపం లేదా? జగన్ నువ్వు చేసిన ప్రతిదీ నేరమేనని, ప్రతి ఘోరానికి చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదని అన్నారు.