NEWSNATIONAL

మోదీ నిధుల మాటేంటి..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన సీఎం స్టాలిన్

త‌మిళ‌నాడు – రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు కేంద్ర స‌ర్కార్ పై. కావాల‌ని రాష్ట్రాల‌పై క‌క్ష క‌ట్టిందంటూ మండిప‌డ్డారు. త‌మిళ‌నాడు రాష్ట్రం ప‌ట్ల వివ‌క్ష త‌గ‌ద‌ని పేర్కొన్నారు. శ‌నివారం సీఎం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అనుస‌రిస్తున్న ఏక‌ప‌క్ష విధానాల‌ను ఖండించారు. త‌మిళులు ఆయ‌న‌ను స‌హించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భంగ‌పాటు త‌ప్ప‌ద‌న్నారు.

రాష్ట్రంలో చోటు చేసుకున్న మిగ్జామ్ తుపాను కార‌ణంగా న‌ష్ట ప‌రిహారంగా రూ. 37,907 కోట్లు ఇవ్వాల‌ని సీఎం డిమాండ్ చేశారు. బాధిత ప్రజల తక్షణ సహాయం, పునరావాసం కోసం తమ‌ ప్రభుత్వం రాష్ట్ర విపత్తు నిధి నుండి ఇప్పటి వరకు రూ.2,477 కోట్లు ఖర్చు చేసింద‌ని స్ప‌ష్టం చేశారు ఎంకే స్టాలిన్.

అయితే, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించినది కేవలం 276 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిపారు. తాము సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత వీటిని మంజూరు చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు. తమిళనాడుకు నిధులు లేవని, న్యాయం చేయలేదని మోసం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రతి చర్యను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.