జగన్ పొన్నవోలుకు రిటర్న్ గిఫ్ట్
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విశాఖపట్టణం – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మరోసారి రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన గురించి చీప్ కామెంట్స్ చేసిన ఆయనను ఏకి పారేశారు.
జగన్ రెడ్డి తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిలా రెడ్డి. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన 6 రోజులకే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి పదవి దక్కిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జ్ షీట్ లో పెట్టించినందుకే పొన్నవోలుకు తన సోదరుడు బహుమతి ఇచ్చాడని ధ్వజమెత్తారు.
ఎవడో తెలియని సుధాకర్ రెడ్డికి 6 రోజుల్లో అడ్వకేట్ జనరల్ పదవి ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. అంత హడావుడిగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో సీఎం చెప్పాలన్నారు. పొన్నవోలు అనే లాయర్ ఎవరో ప్రపంచానికి కూడా తెలియదన్నారు.
జగన్ కోసం సుధాకర్ రెడ్డి పిటీషన్ లు వేశారని…చార్జీ షీట్ లో పేరు పెట్టించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దానికి ప్రతిఫలంగా పదవి జగన్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. తండ్రి మీద కేసులు పెట్టిన వారికి ఏ కొడుకైనా ఇలా పదవి కట్ట బెడతారా అంటూ ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ క్విడ్ అండ్ ప్రో అంటూ ఆరోపించారు.