నా పొత్తు ప్రజలతోనే – జగన్
ప్రజా సంక్షేమం నా లక్ష్యం
అనంతపురం జిల్లా – తను వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోనని, తన పొత్తు కేవలం ప్రజలతో మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రిలో పర్యటించారు. ఆయన మేమంతా సిద్దం యాత్రకు జనం నీరాజనం పలికారు.
ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ రెడ్డి. తాడిపత్రి నుంచి ఇచ్చాపురం దాకా మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లుతో కూటమి జెండాలు జతకట్టి వస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్లు, ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్లు, అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, కుట్రలు, వెన్నుపోట్లు తమ నైజంగా, కూటమిగా, గుంపులు గుంపులుగా.. జెండాలు జతకట్టుకుని వారంతా వస్తున్నారని ఆరోపించారు.
ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు అన్నారు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మన ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు అని స్పష్టం చేశారు సీఎం.
కూటమికి ఓటు వేస్తే మోసానికి వేసినట్టేనని హెచ్చరించారు జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్ర లేపటమే అని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 100 హామీల్లో 99 శాతం అమలు చేశానని చెప్పారు.