ఫ్యాన్ జోరుకు కూటమి గోవిందా
ఎద్దేవా చేసిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
అమరావతి – ఏపీలో ఫ్యాన్ జోరుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొట్టుకు పోవడం ఖాయమని అన్నారు వైసీపీ బాస్, సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్దంకు జనం నీరాజనం పలికారు. తాము ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని, దానిని తట్టుకోలేక కూటమి నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు.
పదే పదే జన్మభూమి కార్యక్రమం అంటూ ఊదరగొట్టే చంద్రబాబు నాయుడు తాను ఏపీకి ఏం చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత ఆయనదేనంటూ ఎద్దేవా చేశారు. ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారంటూ మండిపడ్డారు జగన్ రెడ్డి.
ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తాము వాలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చామని, దీనిని కేంద్రం రోల్ మోడల్ గా కూడా తీసుకునేందుకు ప్లాన్ చేసిందన్నారు. ఇవాళ ఆర్థిక రంగంలో సైతం ఏపీ ముందంజలో కొనసాగుతోందని చెప్పారు. చంద్రబాబుకు నిత్యం అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడం, దోచు కోవడం, దాచు కోవడం తప్పితే ఏమీ తెలియదని అన్నారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సలహా ఇచ్చారు జగన్ రెడ్డి.