హామీలు బారెడు అమలు మూరెడు
జగన్ రెడ్డి హామీలన్నీ బక్వాస్
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. టెక్కలిలో జరిగిన ఏపీ న్యాయ యాత్ర సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన తండ్రి పేరు చెప్పుకుని అధికారంలోకి జగన్ రెడ్డి వచ్చాడని, ఆ తర్వాత తండ్రిని, ఆయన ఆశయాలను మరిచి పోయాడని ఆరోపించారు. ప్రజలు ఆయనను నమ్మ వద్దని కోరారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఆనాడు తన తండ్రి ఆఫ్ షోర్ రిజర్వాయర్ కు శంకుస్థాపన చేశాడని, 50 శాతం పనులు పూర్తి అయినా అకారణ మరణంతో ఆ పనులు ఆగి పోయాయని ఆవేదన చెందారు. ఆ తర్వాత ప్రాజెక్టు పనులను పూర్తిగా నిలిపి వేశారని, దీనికి ప్రధాన కారకుడు సీఎం జగన్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు.
తాను అధికారంలోకి వచ్చాక ఆఫ్ షోర్ పూర్తి చేస్తానని, 30 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చాడని కానీ సంతకం చేశాక, అధికారం తలకెక్కి నిద్ర పోయాడని ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో నిద్ర పోయిండు తట్టెడు మట్టి పోయలేదని పేర్కొన్నారు. టెక్కలికి ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తి చేసిన పాపాన పోలేదన్నారు.