హామీలు సరే అమలు ఏదీ
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
జోగుళాంబ గద్వాల జిల్లా – నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ ను, సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆర్ఎస్పీ మల్దకల్ మండలం దాసరిపల్లిలోని సవరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.
కే.టి.దొడ్డి మండలం పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. పూజలు చేసిన అనంతరం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తో కలిసి గట్టులో ఏర్పాటు చేసిన ముఖ్య పార్టీ నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చారని, ఇప్పటి వరకు ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్పా ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని, బీఆర్ఎస్ పరీక్షలు నిర్వహించిన వాటినే తామే భర్తీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. పాలన చేత కాక పోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్పీ.