NEWSTELANGANA

కాషాయ మూక‌లపై ఆకునూరి క‌న్నెర్ర‌

Share it with your family & friends

ఎస్డీఎఫ్ క‌న్వీన‌ర్ సీరియ‌స్ కామెంట్స్

హైద‌రాబాద్ – సోష‌ల్ డెమోక్ర‌టిక్ ఫోరం చీఫ్ , మాజీ సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆకునూరి ముర‌ళి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ను హ‌రించేలా కాషాయ మూక‌లు (ఏబీవీపీ, బీజేపీ) కాక‌తీయ యూనివ‌ర్శిటీ వేదిక‌గా క‌వులు, ర‌చ‌యిత‌ల మీద దాడులు చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ ఖండించ ద‌గిన విష‌య‌మ‌ని పేర్కొన్నారు. ఈ దేశంలో బీజేపీ కులం, మ‌తం పేరుతో రాజ‌కీయాలు చేస్తోంద‌ని ఆరోపించారు.

విద్వేష పూరిత పాలిటిక్స్ తో ఓట్లు దండు కోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, ఇందులో భాగంగానే ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడే వారిపై కావాల‌ని దాడుల‌కు దిగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచిది కాద‌ని పేర్కొన్నారు. క‌వులు, ర‌చ‌యిత‌ల మీద దాడి జ‌ర‌గ‌డం అంటే ప్ర‌జాస్వామ్యంపై, భార‌త రాజ్యాంగంపై జ‌రిగిన దాడిగా భావించాల్సి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ఆకునూరి ముర‌ళి.

వైస్ ఛాన్స్ ల‌ర్ అనుమ‌తి తీసుకుని స‌మావేశం నిర్వ‌హించ‌డం త‌ప్పా అని ప్ర‌శ్నించారు. చ‌దువులు చెప్పిన అధ్యాప‌కుల‌పై దాడుల‌కు దిగుతారా, ఇదేం సంస్కృతి అని మండిప‌డ్డారు ఎస్డీఎఫ్ క‌న్వీన‌ర్. త‌క్ష‌ణ‌మే దాడుల‌కు పాల్ప‌డిన వారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాడ్ చేశారు ఆకునూరి ముర‌ళి.