మోదీ చేతిలో జగన్ బందీ
ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె మరోసారి తన సోదరుడు, వైసీపీ బాస్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. గత కొంత కాలంగా జగన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు. ప్రధానంగా తన తండ్రి , దివంగత సీఎం వైఎస్ రాజ శేఖర్ రెడ్డిని కావాలని సీబీఐ ఛార్జి షీట్ లో లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా చేర్పించాడని ఆరోపించారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే 6 రోజుల లోపే తనకు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పదవి అప్పగించాడని మండిపడ్డారు.
దేశంలో ఎక్కడా ఇలాంటి సంఘటన జరిగి ఉండదన్నారు. తన బాగు కోసం తండ్రిని కేసులో ఇరికించిన ఘనత ఒక్క జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు వైఎస్ షర్మిల. ఛార్జిషీట్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ చేర్పించ లేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు కాస్తా తెలుసుకుని మాట్లాడితే మంచిదని సూచించారు.
ఒకవేళ తాను తప్పు చేయలేదని అనుకుంటే ముందు జగన్ మోహన్ రెడ్డి తనపై పోటీకి నిలిపిన, తన చిన్నాన్న హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని పోటీ నుంచి విరమించేలా చేయాలని డిమాండ్ చేశారు.