జగన్ కు షర్మిల బహిరంగ లేఖ
సందేహాలకు సమాధానం చెప్పు
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలనంగా మారారు. ప్రస్తుతం ఏపీలో ఆమె కీలకమైన నాయకురాలిగా ఎదిగారు. ప్రధానంగా ఏపీ సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.
బుధవారం వైఎస్ షర్మిల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తాను లేవ నెత్తిన నవ (9) ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా , సాగు భూమి నిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపి వేశారని ప్రశ్నించారు.
28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపి వేశారని తప్పు పట్టారు. ఎస్సీ,ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపిలో ఎందుకు నిలిచి పోయిందని నిలదీశారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల కోసం పెట్టిన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారని మండిపడ్డారు వైఎస్ షర్మిల.
దళిత, గిరిజన సిట్టింగ్ ఎమ్మెల్యే లకు ఈ సారి ఎందుకు సీట్లు ఇవ్వలేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో దళితులపై భారీ ఎత్తున దాడులు జరిగాయి..దీనికి నువ్వే బాధ్యత వహించాలన్నారు . దళిత డ్రైవర్ ను చంపి…సూట్ కేసు లో డోర్ డెలివరి చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టడి సర్కిల్స్ కి నిధులు ఇవ్వకుండా వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారో చెప్పాలన్నారు.