వివేకా హంతకులకు జగన్ వత్తాసు
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి డిమాండ్
కడప జిల్లా – తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో ఏపీలోని ప్రజలందరికీ తెలుసని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ న్యాయ్ యాత్ర పేరుతో చేపట్టిన యాత్ర కడప జిల్లా జమ్ములమడుగు నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు వైఎస్ షర్మిలా.
రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్సార్ కు వివేకా అలా ఉండే వాడని, మా చిన్నాన్న చని పోయి 5 ఏళ్లవుతోందన్నారు. ఆయనను దారుణంగా హత్య చేశారని, అత్యంత పాశవికంగా, కిరాతకంగా చంపారని, ఆ చంపిన వాళ్లు యధేశ్చగా బయటే తిరుగుతున్నారంటూ ఆరోపించారు ఏపీ పీసీసీ చీఫ్.
సీబీఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. అవినాష్ రెడ్డి నిందితుడు అని అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఇవి తాము చెప్పడం లేదని, సీబీఐ చెబుతోందన్నారు. అన్ని వేళ్లు అతడినే చూపిస్తున్నాయని అన్నారు.
చంపించిన వారికి, చంపిన వారికి ఇప్పటి వరకు శిక్ష పడలేదన్నారు. హంతకులను కాపాడుతున్నది ఎవరో కాదు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.