తెలంగాణలో హస్తానిదే హవా
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణలో ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడం ఖాయమని స్పష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ , బీజేపీ కలల్లో తేలి యాడుతున్నాయని కానీ ఆయా పార్టీలను జనం నమ్మే స్థితిలో లేరన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా పాలన కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతోందన్నారు. ఎన్నికల సందర్బంగా తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేస్తున్నామని, ఇందులో ఒక్కటి మాత్రం మిగిలి పోయిందన్నారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆరు నూరైనా సరే వచ్చే పంధ్రాగష్టు నాటికి ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగే ప్రసక్తి లేదన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ , బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నమ్మ వద్దని కోరారు.
గత ప్రభుత్వం ఖాళీ ఖజానా చేతికి ఇచ్చిందని, ఇదే మాజీ సీఎం తనను టార్గెట్ చేయడం, విమర్శలు చేయడం దారుణమన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇకనైనా నిరాధారమైన ఆరోపణలు మానుకుంటే మంచిదని సూచించారు. మొత్తంగా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటడం తప్పదన్నారు.