హైదరాబాద్ భళా రాజస్థాన్ బోల్తా
ఉత్కంఠ భరిత పోరులో ఓటమి
హైదరాబాద్ – ఐపీఎల్ 2024లో హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ మైదానం వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ ఆద్యంతమూ ఉత్కంఠను రేపింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. ఎవరు గెలుస్తారని కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరి బిగపట్టి చూశారు. ఈ 17వ లీగ్ సీజన్ లో ఇంత టెన్షన్ రేపిన మ్యాచ్ ఇదే కావడం విశేషం.
సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడింది. ఎక్కడా తడ బాటుకు గురి కాలేదు. ప్రధానంగా హైదరాబాద్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ , కెప్టెన్ పాట్ కమిన్స్ చుక్కలు చూపించారు. రాజస్థాన్ టాప్ ఆర్డర్ ను కూల్చి వేశారు. మొత్తంగా ఐపీఎల్ లో ఉన్న మజా ఏమిటో ఈ మ్యాచ్ మరోసారి తెలియ చేసింది.
హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 201 రన్స్ చేసింది. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆరంభంలోనే జోస్ బట్లర్ , కెప్టెన్ శాంసన్ లను అద్భుతమైన బంతులతో బోల్తా కొట్టించాడు భువీ.
దీంతో తక్కువ స్కోర్ కే చాప చుట్టేస్తుందని అనుకున్నారు. కానీ అడ్డు గోడలా నిలిచారు యువ క్రికెటర్లు జైశ్వాల్ , రియాన్ పరాగ్. ఈ ఇద్దరూ ఔట్ కావడంతో హెట్మైర్ , పావెల్ గెలిపిస్తారని అనుకున్నారు. చివరి బంతికి ఎల్ బీ డబ్ల్యూ గా వెను దిరగడంతో రాజస్థాన్ ఓటమి పాలవ్వక తప్పలేదు.