లక్ష తులాలు బాకీ పడ్డారు
కాంగ్రెస్ సర్కార్ పై తన్నీరు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆడ బిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని , ఇప్పటి వరకు ఒక్క తులం అయినా ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.
గత రెండు నెలల్లో లక్ష పెళ్లిళ్లు అయ్యాయని, దీంతో ఆడబిడ్డ కట్నం కింద తులం బంగారం ఇస్తానని చెప్పారని గుర్తు చేశారు హరీశ్ రావు. సోయి లేని సీఎం దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ఆరు గ్యారెంటీలు కావని అవి గారడీలు అంటూ ఎద్దేవా చేశారు . ప్రభుత్వం వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. తమ హయాంలో పరీక్షలు నిర్వహించిన వాటికి ఫలితాలు ప్రకటించారని, వాటిని తామే భర్తీ చేశామని గొప్పలు చెప్పడం దారుణమన్నారు హరీశ్ రావు.