NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ మోసం ఉద్యోగుల‌కు శాపం

Share it with your family & friends

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

క‌డ‌ప జిల్లా – ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా క‌డ‌ప లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ప్ర‌ధానంగా జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయ‌న చేసిన మోసం వ‌ల్ల ఉద్యోగుల‌కు శాపంగా మారింద‌ని అన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను ప‌ర్మినెంట్ చేస్తాన‌ని ఎన్నిక‌ల సంద‌ర్బంగా హామీ ఇచ్చార‌ని , ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు దాని ఊసెత్త‌డం లేదంటూ ప్ర‌శ్నించారు జ‌గ‌న్ రెడ్డిని.

దోచు కోవ‌డం, దాచు కోవ‌డంపై ఉన్నంత శ్ర‌ద్ద ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై లేద‌న్నారు. దివంగ‌త సీఎం , త‌న తండ్రి వైఎస్సార్ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేశార‌ని, కానీ ఆయ‌న పేరు చెప్పుకుని అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ రెడ్డి తూట్లు పొడిచాడంటూ ధ్వ‌జ‌మెత్తారు.

రాబోయే ఎన్నిక‌లు న్యాయానికి , నేరానికి మ‌ధ్య జ‌రుగుతున్న పోరాట‌మ‌ని స్ప‌ష్టం చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. గౌర‌వంగా బ‌త‌కాల్సిన ఉద్యోగుల‌ను అవ‌మానానికి గురి చేయ‌డం దారుణ‌మ‌న్నారు. బొత్స లాంటి వాళ్లు కాళ్లు ప‌ట్టుకుని అడ‌గాల‌ని అన‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘాల‌కు క‌నీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఉద్యోగ స‌మ‌స్య‌ల గురించి వెంట‌నే సీఎం స‌మాధానం చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు.