శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు
స్వామి వారిని దర్శించుకున్న భక్తులు 62,624
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన కలియుగ పుణ్య క్షేత్రం తిరుమల భక్తుల సందోహంతో కళ కళ లాడుతోంది. ఎక్కడ చూసినా భక్త బాంధవులే కనిపిస్తున్నారు. గోవిందా గోవిందా , అనాధ రక్షక గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా, శ్రీనివాసా గోవిందా, అదివో అల్లదివో శ్రీహరి వాసము, పది వేల శేషుల పడగల మయం అంటూ కీర్తిస్తున్నారు. స్వామి , అమ్మ వార్ల జపం చేస్తున్నారు.
ఎండా కాలం కావడం, వేసవి సెలవులు ఇవ్వడంతో పిల్లా పాపలతో , యువతీ యువకులు, తల్లిదండ్రులు, వృద్దులతో నిండి పోయింది తిరుమల . భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసింది. శ్రీవారి సేవకులు భక్తుల సేవలో నిమగ్నం అయ్యారు.
మే 2వ తేదీ గురువారం రోజు శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 62 వేల 624 మంది భక్తులు దర్శించుకున్నారు. 32 వేల 638 మంది భక్తులు స్వామి వారికి తల నీలాలు సమర్పించినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.96 కోట్లు వచ్చినట్లు తెలిపారు.
స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం భక్తులు 30 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 12 గంటలకు పైగా పట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు.