సంజూకు హైదరాబాద్ ఫ్యాన్స్ ఫిదా
వరల్డ్ కప్ లో సత్తా చాటాలని ఫ్లెక్సీస్
హైదరాబాద్ – కేరళ స్టార్ , రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024లో మోస్ట్ పాపులర్ ప్లేయర్ గా మారాడు. గత కొంత కాలంగా శాంసన్ పై బీసీసీఐ కక్ష కట్టింది. చివరకు టోర్నీలో దుమ్ము రేపడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వచ్చే జూన్ నెలలో అమెరికా, విండీస్ లలో జరిగే టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టుకు ఎంపిక చేసింది.
దీంతో పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. కేరళ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత తిరువనంతపురం సిట్టింగ్ ఎంపీ శశి థరూర్ తో పాటు ప్రముఖ మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ , తాజా, మాజీ క్రికెటర్లు సైతం సంజూ శాంసన్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇదిలా ఉండగా టోర్నీలో భాగంగా కీలకమైన లీగ్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగింది. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది రాజస్థాన్ రాయల్స్. కాగా స్టేడియంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన అభిమానులు సంజూ శాంసన్ కు మద్దతుగా నిలిచారు. తను వరల్డ్ కప్ లో సత్తా చాటాలని కోరుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.