రేవంత్ వైఫల్యం రాష్ట్రానికి శాపం
నిప్పులు చెరిగిన్న తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలనా పరంగా ఫెయిల్ అయ్యారంటూ మండిపడ్డారు.
విచిత్రం ఏమిటంటే ఆయనకు ఆంధ్రా మూలాలు ఉన్నాయని ఆరోపించారు. ఉద్యమ రథ సారథి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ కోసం పోరాడిన సంగతి మరిచి పోయేలా చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో 10 ఏళ్లు ఉండాలని ఆంధ్రా నేతలు కోరుతున్నారని, ఇది ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలోనే ఈ విషయం స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలు సీఎం పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు తన్నీరు హరీశ్ రావు.
లోక్ సభ ఎన్నికల్లో 8 సీట్లకు పైగా గెలుచు కోవాలని బీజేపీతో కాంగ్రెస్ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం నడుస్తోందని, కాంగ్రెస్ సర్కార్ రివర్స్ గేర్ లో వెళుతోందని ఫైర్ అయ్యారు.