కొత్త జిల్లాలు తొలగిస్తే ఖబడ్దార్
పోరాటం చేస్తామని హెచ్చరిక
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. తమ హయాంలో ముందు జాగ్రత్తగా ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
దీని వల్ల ప్రజలకు త్వరితగతిన పనులు అయ్యేందుకు ఆస్కారం ఏర్పడిందన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భవనాలను కూడా నిర్మించడం జరిగిందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకేచోట ఉండేలా ప్లాన్ చేశామన్నారు.
కానీ ఆంధ్రా మూలాలు కలిగిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా నాలుగున్నర కోట్ల ప్రజల్లో గూడు కట్టుకున్న కేసీఆర్ రూపాన్ని తొలగించడం ఆయన తరం కాదన్నారు కేటీఆర్. ఇకనైనా ప్రజలకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
కొత్త జిల్లాలను తొలగించాలని ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.