మల్లు రవికి వేల కోట్లు ఎక్కడివి
నిలదీసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ
నాగర్ కర్నూల్ జిల్లా – కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న ఎంపీ అభ్యర్థి మల్లు రవిపై బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఎంపీగా పని చేసిన సమయంలో పాలమూరు జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని, పదవిని అడ్డం పెట్టుకుని అనేక రకాలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన చరిత్ర నీది కాదా అని నిలదీశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలంలో పర్యటించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో ఇదే పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్లు రవి ఏం చేశారో, ఎన్ని నిధులు తీసుకు వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్పీ.
ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో, ఏం కష్టం చేస్తే సంపాదించారో ప్రజలకు చెబితే బాగుంటుందన్నారు. మరి మీకు ఓట్లు వేసిన ప్రజలు ఎందుకు ఇంకా పేదరికంలో ఉన్నారో , దానికి కారణం ఎవరో చెప్పాల్సిన బాధ్యత మల్లు రవిపై ఉందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.