మోదీ మోసం దేశానికి శాపం
ప్రియాంక గాంధీ కామెంట్స్
కర్ణాటక – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబద్దాల పునాదుల మీద పాలన సాగిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటకలోని దావణగెరెలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ పదేళ్ల కాలంలో ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ దేశానికి ఏం చేశారో చెప్పాలన్నారు. కేవలం తన ప్రచారం కోసం పని చేస్తున్నారే తప్పా ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రోజు రోజుకు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అధిక ధరల శాపం పెరిగి పోయిందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అభ్యర్థి ప్రభా మల్లికార్జున్ ను గెలిపించాలని కోరారు. కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందజేస్తోందని కొనియాడారు. ఇప్పటి వరకు ప్రకటించిన 5 గ్యారెంటీలను వంద శాతం అమలు చేస్తున్న ఘనత తమదేనని పేర్కొన్నారు. ఇకనైనా ప్రజలు ఆలోచించాలని మోదీకి ఓటు వేస్తే దేశం ప్రమాదంలో ఉన్నట్టేనని భావించాలని అన్నారు ప్రియాంక గాంధీ.