పాలమూరు తల రాత మారుస్తా
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
వనపర్తి జిల్లా – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో జరిగిన రోడ్ షోలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా తాను ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బిడ్డనని అన్నారు. ఈ గడ్డ రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవుడిని, ఈ జిల్లా వాసులను మరిచి పోలేనని అన్నారు.
తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, కష్టాలు, కన్నీళ్లు అనుభవించి వచ్చానని, కష్టం విలువ ఏమిటో , రైతుల ఇబ్బందులు ఏమిటో, ఈ వలస పక్షుల ఈతి బాధలు తెలుసన్నారు. అందుకే తాను ఈ జిల్లాపై ఫోకస్ పెట్టానని అన్నారు.
ముఖ్యమంత్రిగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాంతాన్ని దేశంలోనే ఆదర్శ ప్రాయంగా నిలిచేలా చేస్తానని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి. వలసలతో తరలి పోతున్న నా ప్రజలను చూస్తూ ఎదిగానని చెప్పారు. పాలమూరు తల రాతలు మార్చే అవకాశం వచ్చిందన్నారు. కొత్తకోట గల్లీలో వేలాది మంది సాక్షిగా మాట ఇస్తున్నానని, మీ నమ్మకం వమ్ము కాదన్నారు.