చంద్రబాబు..లోకేష్ పై కేసు
దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ
అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు , జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలో శాసన సభ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 13న పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా ఇరు పార్టీలకు చెందిన అగ్ర నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ రక్తి కట్టిస్తున్నారు.
ఇందులో భాగంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై భారీ ఎత్తున వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది వైఎస్సార్సీపీ . ఈ సందర్బంగా ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో సీఐడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే బాబు, లోకేష్ లపై పలు కేసులు నమోదయ్యాయి.
ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించింది. కేసులో భాగంగా ఏ1గా చంద్రబాబు నాయుడు, ఏ2గా నారా లోకేష్ బాబును చేర్చింది. ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేసింది.