ఏపీపై ఎందుకింత వివక్ష
సజ్జల రామకృష్ణా రెడ్డి ఫైర్
అమరావతి – ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రోజు రోజుకు పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతున్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు పట్ల ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఎవరో ఏదో చెబితే వాటిని నమ్మి చర్యలు తీసుకుంటే ఎలా అని మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి ఒక న్యాయం ..ఏపీ రాష్ట్రానికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. ఏపీలో అర్ధాంతరంగా లక్షలాది మందికి లబ్ది చేకూర్చే పథకాలను నిలుపుదల చేయడం ఎంత మాత్రం సబబు కాదన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. దీని వెనుక ఎవరు ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు .
విచిత్రం ఏమిటంటే తెలంగాణలో రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చేందుకు అంగీకరించిన ఎన్నికల సంఘం తమ దాకా వస్తే ఎందుకు కఠినంగా, వివక్షా పూరితంగా నిర్ణయం తీసుకుందో తమకే తెలియడం లేదన్నారు. ఇకనైనా ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సజ్జల కోరారు.