NEWSANDHRA PRADESH

ఏపీలో 70 శాతానికి పైగా పోస్ట‌ల్ బ్యాలెట్

Share it with your family & friends

మొత్తం 4.30 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు

అమ‌రావ‌తి – పోస్టల్ బ్యాలెట్ కోసం ధరఖాస్తు చేసుకున్న 4.30 లక్షల మందిలో, ఇప్పటి వరకూ 3.03 లక్షల (70%) మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించు కున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

మంగళ‌వారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబందించిన పలు విషయాలను వివరించారు. కొన్ని జిల్లాల్లో 3 వ తేదీన మరికొన్ని జిల్లాల్లో 4 వ తేదీన హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం అయిందన్నారు.

కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాట్లకు సంబందించి కొన్ని సమస్యలు తలెత్తిన వెంటనే వాటిని పరిష్కరించడం జరిగిందన్నారు. తాను స్వయంగా ఈ నెల 5 వ తేదీన విజయనగరం జిల్లాల్లో పర్యటించి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను పరిశీలించడం జరిగిందన్నారు మీనా.

వినియోగించుకున్న వారిలో 3.20 లక్షల మంది ఉద్యోగులు, 40 వేల మంది పోలీసులు, హోమ్ ఓటింగ్ కేటగిరీ క్రింద 28 వేల మంది, ఎసెన్షయల్ సర్వీసెస్ కేటగిరీ క్రింద 31 వేల మంది, మిగిలిన వారిలో సెక్టార్ ఆఫీసర్లు, ఇతరులు ఉన్నట్లు ఆయన తెలిపారు.

పోస్టల్ బ్యాలెట్ వినియోగం విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారిని సస్పెండ్ చేయడం కూడా జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు.

పోస్టల్ బ్యాలెట్ విషయంలో లంచాలు ఇచ్చే వారి పైనే కాకుండా లంచాలు పుచ్చుకునే వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంద‌ని తెలిపారు. ఈ విషయంలో ఉద్యోగులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.