అంతా అప్రమత్తంగా ఉండండి
ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – భానుడి ప్రతాపానికి గజ గజ లాడుతున్న జనానికి ఒక్కసారిగా ప్రకృతి కరుణించింది. భారీ ఎత్తున ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో హైదరాబాద్ నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు సీఎం. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ, ట్రాన్స్‌కో, పోలీసు అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశించారు.
లోతట్టు కాలనీలు, ట్రాఫిక్, విద్యుత్ సమస్యపై సమీక్ష చేపట్టారు. సహాయక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాస రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ఎస్.ఏ.ఎం రిజ్వి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు.
భారీ వర్షాలు, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు.