NEWSTELANGANA

హిందూత్వం పేరుతో రాజ‌కీయం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా – భార‌తీయ జ‌న‌తా పార్టీపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న పార్టీ అభ్య‌ర్థి జీవ‌న్ రెడ్డి త‌ర‌పున ప్ర‌చారం చేప‌ట్టారు. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. బీజేపీ ఫ‌క్తు అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని ఆరోపించారు. జ‌నం ఆ పార్టీని న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో కాషాయ జెండాకు కోలుకోలేని షాక్ త‌ప్ప‌ద‌న్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.

బీజేపీ వాళ్లు తామే గొప్ప వాళ్ల‌మ‌ని, అస‌లైన హిందువుల‌మ‌ని అనుకుంటున్నార‌ని కానీ వాళ్లు నిజ‌మైన హిందువులు కానే కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం. దేవుళ్ల పేరుతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టి, మ‌తం పేరుతో రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ప‌దేళ్ల బీజేపీ పాల‌న‌లో ఏం చేశారో దేశానికి చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇవాళ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను గంప గుత్త‌గా అమ్మే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని, లాభాల బాట‌లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు ప్రైవేట్ ప‌రం చేయాల్సి వ‌చ్చిందో చెప్పాల‌న్నారు.

దేశ వ‌న‌రుల‌ను, సంప‌ద‌ను కొంత మందికే దోచి పెట్టేందుకే ప్ర‌ధాని మోదీ పని చేస్తున్నారంటూ ఆరోపించారు ఎనుముల రేవంత్ రెడ్డి.