ఓటు కీలకం ప్రజాస్వామ్యానికి మూలం
భవిష్యత్తు బాగుండాలంటే ఓటేయాలి
మెదక్ జిల్లా – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ దేశంలో ఓటు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. ఈ విషయాన్ని 143 కోట్ల మంది భారతీయులు గుర్తించాలని సూచించారు. దేశ భవిష్యత్తు ఓటుపై ఆధార పడి ఉందన్న సంగతి మరిచి పోవద్దని సూచించారు కేసీఆర్.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లాలో పర్యటించారు. పటాన్ చెరులో పార్టీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డికి మద్దతుగా భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. ఈ సందర్భంగా అశేష జనవాహినిని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. వ్యవస్థలు బలోపేతం కావాలన్నా, రాష్ట్రం పరుగులు పెట్టాలన్నా, అభివృద్దిలో ముందుకు సాగాలన్నా ఓటర్లు సరైన నాయకులను, ప్రజా ప్రతినిధులను ఎన్ను కోవాల్సి ఉంటుందన్నారు.
లేక పోతే దేశమే కాదు రాష్ట్ర భవిష్యత్తు కూడా అంధకారం కాక తప్పదన్నారు. గత ఎన్నికల్లో మోస పూరితమైన ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అమలు చేయలేక చేతులెత్తేసిందని అన్నారు.
ఇప్పటికైనా ప్రజలు తాము మోస పోయామని గుర్తించి పని చేసే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్.