మాదిగలకు మోదీ గ్యారెంటీ
కమలానికి ఓటు వేయండి
హైదరాబాద్ – మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. మాదిగలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్యారెంటీ ఇచ్చారని, ఇక ఏ పార్టీకి చెందిన వారైనా సరే మాదిగలంతా గంప గుత్తగా బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో అన్ని పార్టీలు మనల్ని మోసం చేశాయని, ఇన్నాళ్లుగా కేవలం ఓటు బ్యాంకు గానే చూశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మొదటిసారిగా జాతీయ పార్టీ అయిన బీజేపీ మాదిగలకు గుర్తింపుతో పాటు గౌరవాన్ని ఇచ్చేలా రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రజల సమక్షంలో మోదీ ప్రకటించారని గుర్తు చేశారు.
ఆ వెంటనే రిజర్వేషన్లు కల్పించేందుకు గాను ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఘనత కేవలం పీఎంకు మాత్రమే దక్కుతుందన్నారు మందకృష్ణ మాదిగ. మన బిడ్డలకు భరోసా ఇవ్వడంతో పాటు మన హక్కులకు గ్యారెంటీ ఇచ్చిన ఏకైక ప్రధాని మోదీకి మనమంతా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ఎంఆర్పీఎస్ చీఫ్.