అధికారంలోకి వస్తే కుల గణన
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
మెదక్ జిల్లా – వాయనాడు సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో కోట్లాది మంది నేటికీ గుర్తింపునకు నోచుకోకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లాలో తమ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశంలో వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దళితులు, పేదలు, సాధారణ, మైనారిటీ తరగతుల జనాభా దాదాపు 90 శాతానికి పైగా ఉన్నారని వెల్లడించారు. భారీ ఎత్తున ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ వారికి ఈ దేశంలో భాగస్వామ్యం కల్పించక పోవడం దారుణమన్నారు రాహుల్ గాంధీ.
దీని కారణంగా ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో కుల గణన నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు. దీని వల్ల 143 కోట్ల మంది భారతీయులలో ఎవరికి ఎంత వాటా అనేది తేలుతుందన్నారు.
కోటా మేరకు రిజర్వేషన్లు , సీట్ల కేటాయింపు, ఉద్యోగాలలో అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.