బస్సులో రాహుల్ వైరల్
దిల్ షుక్ నగర్ లో కరపత్రాల పంపిణీ
హైదరాబాద్ – వాయనాడు సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలనంగా మారారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణలో పర్యటించారు. మెదక్ సభలో పాల్గొన్న అనంతరం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో కలిసి సర్ ప్రైజ్ ఇచ్చారు. సెక్యూరిటీని కాదని నగరంలోని దిల్ షుక్ నగర్ బస్టాప్ వద్దకు హడావుడిగా వెళ్లారు. ఆయనను అనుసరించారు రేవంత్ రెడ్డి.
సిటీ బస్సులో సాధారణ ప్రయాణికుల మాదిరిగానే తను కూడా ప్రయాణం చేశారు. ఈ సందర్బంగా పార్టీకి సంబంధించిన కరపత్రాలను బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి స్వయంగా అందజేశారు రాహుల్ గాంధీ. తాము ఇప్పటికే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. ఆరు గ్యారెంటీలకు గాను ఐదు గ్యారెంటీలను అమలు చేశామని, మరో గ్యారెంటీ మాత్రమే మిగిలి ఉందని చెప్పారు రాహుల్ గాంధీ.
మోదీ అబద్దాలను నమ్మ వద్దని, రాబోయేది ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమినే అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీతో సెల్ఫీలు దిగేందుకు , ఆయనతో మాట్లాడేందుకు పోటీ పడ్డారు ప్రయాణీకులు.
కాగా రాహుల్ గాంధీ బస్సు ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. తాను సామాన్యుడినని మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ.