ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టండి
ఆదేశాలు జారీ చేసిన సీఈఓ మీనా
అమరావతి – ఏపీలో మే 13న శాసన సభ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఎన్నికలలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు సీఇఓ.
అన్ని జిల్లాల ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం చివరి 72 గంటల్లో,, పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్ల గురించి వివరించారు. హింసకు, రీపోలింగ్ కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల డీఈవోలు, ఎస్పీ లను ఆదేశించారు. ఈ నెల 11 వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోల్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం అమల్లోకి వస్తుందన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరూ ఉల్లంఘించ కూడదన్నారు. చట్ట విరుద్ధమైన సమావేశాలపై నిషేధం ఉంటుందన్నారు. 48 గంటల వ్యవధిలో (సైలెన్స్ పీరియడ్) బహిరంగ సభలను నిర్వహించడం చట్ట విరుద్దమన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు సిఇఓ.
రాష్ట్రంలోను, అంతర్ రాష్ట్రాల నుండి వచ్చే లారీలు, వాణిజ్య వాహనాలు, తేలికపాటి వాహనాల కదలికలపై గట్టి నిఘా ఉంచాలన్నారు. ఎస్‌హెచ్‌జి సభ్యులకు నిధులు, బహుమతులు, ఆహారం ఉచితంగా పంపిణీ చేయకూడదని, కమ్యూనిటీ హాళ్ల వినియోగం, కూపన్‌లు, కార్డుల పంపిణీ, కమ్యూనిటీ కిచెన్ మొదలైనవి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.