వైఎస్సార్ నా తండ్రికి సోదరుడు
ఆయన జీవితం ఆదర్శ ప్రాయం
కడప జిల్లా – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కడపలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అంతకు ముందు ఇడుపులపాయకు చేరుకున్నారు. అక్కడ దివంగత వైఎస్సార్ సమాధిని సందర్శించి , పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దివంగత రాజశేఖర్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ తన తండ్రి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి సోదర సమానుడని స్పష్టం చేశారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్ట పడేవారని, గౌరవం కూడా ఎక్కువ అని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి కేవలం ఏపీకే కాకుండా మొత్తం దేశానికి మార్గదర్శకులయ్యారని రాహుల్ గాంధీ కొనియాడారు.
ఏపీలో ప్రస్తుతం నేరానికి, న్యాయానికి మధ్య యుద్దం జరుగుతోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే , అభివృద్ది జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, కేవలం హామీల పేరుతో మోసం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ.