ఎవరి అంచనాలు వారివే
నువ్వా నేనా రీతిలో ప్రచారం
తెలంగాణ – ఎన్నికల ప్రచారం ముగిసింది. అన్ని పార్టీలు హోరా హోరీగా పోరాడాయి. ఆయా పార్టీలకు చెందిన నేతలు నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దానికి తెర లేపారు. ఒకరకంగా చెప్పాలంటే దిగజారుడు రాజకీయాలు ఎలా ఉంటాయో చూశారు జనం.
మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కనీసం 14 సీట్లు వస్తాయని అంటోంది. ఆ పార్టీ తరపున సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానై ప్రచారం చేశారు. ఆయనకు మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేపట్టారు.
ఇక బీజేపీ ఈసారి గణనీయంగా ఓటు బ్యాంకు షేర్ చేసుకుంటుందని భావిస్తోంది. కనీసం తమకు 12 సీట్లకు పైగానే వస్తాయని చెబుతోంది. ఆ పార్టీకి ఇప్పటికే 4 సీట్లు ఉన్నాయి. ఈసారి అదనంగా తమకు సీట్లు రానున్నాయని అంటోంది. ఆ పార్టీ తరపున కిషన్ రెడ్డితో పాటు మోదీ, అమిత్ షా, మురుగన్, అన్నామలై , తేజస్వి సూర్య లాంటి నేతలు క్యాంపెయిన్ చేపట్టారు.
ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆ పార్టీ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ రథ సారథిగా ఎప్పటి లాగే ముందున్నారు. ఆయన చేపట్టిన బస్సు యాత్రకు భారీ ఆదరణ లభించింది. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీశ్ రావు జల్లెడ పట్టారు. కాలికి బలపం కట్టుకుని తిరిగారు. మొత్తంగా తమకు 14 సీట్లు వస్తాయని భావిస్తున్నారు. ఇక ఎంఐఎం చీఫ్ ఓవైసీ తో పాటు సోదరుడు అక్బరుద్దీన్ , ఎంఐఎం ఎమ్మెల్యేలు భారీ ఎత్తున ప్రచారం చేపట్టారు. తను గెలవడం ఖాయమని పేర్కొంటున్నారు.