తెలంగాణాలో భారీగా పోలింగ్
వెల్లడించిన సీఈవో వికాస్ రాజ్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. సోమవారం భారీ ఎత్తున ఓటర్ల నుంచి స్పందన వచ్చిందని స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఆయన మీడియాతో మాట్లాడారు.
సాయంత్రం 5 గంటల లోపు 61.59 పోలింగ్ శాతం నమోదైందని వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత శాతం నమోదైందనే విషయాన్ని మే 14న మంగళవారం పూర్తి వివరాలు తెలియ పరుస్తామని చెప్పారు వికాస్ రాజ్.
ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ పూర్తి కావడంతో ఈవీఎంలను సీజ్ చేసి, వాటిని భద్రంగా స్ట్రాంగ్ రూమ్ లకు తరలించే పనిలో నిమగ్నం అయ్యారని పేర్కొన్నారు సీఈవో. మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను 106 అసెంబ్లీ నియోజకవర్గాలలో సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ జరిగిందని చెప్పారు.
మొత్తం 400 ఫిర్యాదులు అందాయని, 200కు పైగా విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు వికాస్ రాజ్. ఈవీఎంలను భద్ర పరిచేందుకు గాను రాష్ట్రంలో 44 స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.