మోడీ మోసం దేశానికి శాపం
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక
ఉత్తర ప్రదేశ్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె యూపీలోని రాయ్ బరేలి లోక్ సభ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ, రోడ్ షో చేపట్టారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఈ దేశంలోని యువత ప్రతిభా నైపుణ్యం ఉన్నప్పటికీ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారి ఆశలపై ప్రధాన మంత్రి నీళ్లు చల్లారంటూ మండిపడ్డారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఈ 10 సంవత్సరాల పాలనా కాలంలో కనీసం 50 వేల పోస్టులు కూడా భర్తీ చేయలేక పోయారంటూ ప్రియాంక గాంధీ వాపోయారు.
ప్రభుత్వ రంగ సంస్థలను సర్వ నాశనం చేశాడని, వ్యవస్థలను పని చేయకుండా చేయడంలో కీలక పాత్ర పోషించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజలు మేలు కోవాలని లేక పోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.